బెంగళూరు: భార్య హత్య కేసులో ఆమె భర్త జైలుకెళ్లాడు. అయితే ఆ మహిళ తన ప్రియుడితో కలిసి కనిపించింది. (Wife with lover, Husband Jailed) ఇది తెలిసి ఆమె భర్తతోపాటు పోలీసులు షాక్ అయ్యారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బసవనహళ్లి గ్రామానికి చెందిన సురేష్, మల్లిగే భార్యాభర్తలు. 2019లో భార్య అదృశ్యమైంది. సురేష్ ఆమె కోసం వెతికాడు. బంధువుల వద్ద ఆరా తీశాడు. అయితే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న ఆమె అతడితో కలిసి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నాడు. అయినప్పటికీ భార్యకు పలుసార్లు ఫోన్ చేశాడు. కనీసం పిల్లలతోనైనా టచ్‌లో ఉండాలని కోరాడు.
కాగా, ఫోన్ కాల్స్‌కు భార్య స్పందించకపోవడంతో ఆమె వల్ల తాను ఇబ్బందిలో పడతానని సురేష్ భావించాడు. దీంతో 2021లో తన భార్య కనిపించడంలేదని కుశాల్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే 2022లో బెట్టాడపుర సమీపంలో అతడి భార్య అవశేషాలున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తించాలని చెప్పగా అత్తతో కలిసి అస్థిపంజరాన్ని చూశాడు. తన భార్యవిగా భావించి అంత్యక్రియలు నిర్వహించాడు.
మరోవైపు కొన్ని రోజుల తర్వాత సురేష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. భార్య మల్లిగేను అతడు హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు. కాదని అతడు ఎంత మొత్తుకున్నప్పటికీ వినిపించుకోలేదు. సురేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే మృతురాలి అస్థిపంజరం అవశేషాలు మల్లిగే కుటుంబ సభ్యులతో మ్యాచ్ కాలేదని డీఎన్ఏ టెస్ట్‌లో నిర్ధారణ అయ్యింది. దీంతో సురేష్‌ను నిర్దోషిగా నిర్ధారించి జైలు నుంచి విడుదల చేశారు.
కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1న మల్లిగే అందరిని ఫూల్ చేసింది. మడికేరిలోని ఒక హోటల్‌కు ప్రియుడితో కలిసి వెళ్లింది. సురేష్ భార్య బతికే ఉండటాన్ని చూసి అతడి స్నేహితులు షాకయ్యారు. ఫొటోలు తీసి అతడికి పంపారు. ఆమె జీవించి ఉన్నట్లు తెలిసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. మల్లిగే ఆచూకీని గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. మైసూరు కోర్టులో ప్రవేశపెట్టారు.