బెంగళూరు: ఆర్థిక వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తి కత్తితో మరో వ్యక్తిని బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని స్తంభానికి కట్టేసి కొట్టారు. (Man Tied To Pole, Beaten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నాటకలోని మాండ్యా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జి బొమ్మనహళ్లి గ్రామానికి చెందిన నగేష్, డబ్బు విషయమై చలువేశ్ను కత్తితో బెదిరించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కాగా, చలువేశ్, అతడి స్నేహితులు కలిసి నగేష్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. అతడి చెంపలు వాయించారు. అయితే ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. నగేష్‌ను రక్షించేందుకు ప్రయత్నించారు. అతడి చేతులు, కాళ్లకు కట్టిన తాడును తొలగించి విడిపించారు. నీటిని తాగించారు.
మరోవైపు నగేష్‌ను కట్టేసి కొట్టడంపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.