లక్నో: పెళ్లైన వ్యక్తి వివాహిత మహిళను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. నిరాకరించడంతో నిద్రిస్తున్న ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై యాసిడ్ పోశాడు. ఆ మహిళతో పాటు ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి. (Man Throws Acid On Woman) ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షేర్‌గఢ్ ప్రాంతానికి చెందిన దేవికి వివాహం కావడంతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, తన కుటుంబంతో కలిసి ఆమె నివసిస్తున్నది.
కాగా, అదే ప్రాంతానికి చెందిన ఉమేష్ కశ్యప్‌కు పెళ్లైంది. అయితే వివాహిత అయిన దేవిని పెళ్లి చేసుకుంటానని అతడు ప్రతిపాదించాడు. నిరాకరించిన ఆమెపై కక్షగట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున దేవి ఇంటి పైకప్పు నుంచి ఉమేష్ లోపలకు ప్రవేశించాడు. ఇంటి వరండాలో కుటుంబంతో కలిసి నిద్రిస్తున్న దేవి, ఆమె కుటుంబ సభ్యులపై దోమ తెర నుంచి యాసిడ్ పోశాడు. దీంతో దేవి, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు యాసిడ్ దాడిలో గాయపడ్డారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. యాసిడ్ దాడిలో గాయపడిన దేవి, ఆమె భర్త, ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు ఉమేష్ అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.