న్యూఢిల్లీ: పాత పరిచయం ఉన్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. ఆమె మృతదేహానికి రాయి కట్టి కాలువలో పడేశాడు. (Man Dumps Woman Body In Canal) ఐదు రోజుల తర్వాత ఉబ్బిన మహిళ మృతదేహం కాలువలో తేలింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సీమాపురి సుందరి నగర్ ప్రాంతానికి చెందిన కోమల్‌కు ట్యాక్సీ డ్రైవర్ అయిన ఆసిఫ్‌తో గతంలో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 12న ఆమెను ట్యాక్సీలో అతడు ఎక్కించుకున్నాడు.
కాగా, ఈ సందర్భంగా కోమల్, ఆసిఫ్ మధ్య గొడవ జరిగింది. దీంతో కారులో ఉన్న ఆమె గొంతునొక్కి హత్య చేశాడు. ఆ తర్వాత కోమల్ మృతదేహానికి రాయి కట్టి కాలువలో పడేశాడు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
మరోవైపు మార్చి 17న చావ్లా ప్రాంతంలోని కాలువలో మహిళ మృతదేహం తేలడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని కాలువ నుంచి బయటకుతీశారు. మృతురాలిని కోమల్గా గుర్తించారు. ఆమెను హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలింది.
అయితే పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కోమల్‌ను హత్య చేసిన నిందితుడైన ఆసిఫ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. కోమల్ హత్యలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉన్నదా? అన్న దానిపై దర్యాప్తు చేస్టున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.