జైపూర్: ముగ్గురు వ్యక్తులు ఒకరికి హోలీ రంగులు పూసేందుకు ప్రయత్నించారు. అతడు అడ్డుకోవడంతో దారుణంగా కొట్టారు. ఆ వ్యక్తి గొంతునొక్కి చంపారు. (Man Strangled To Death) ఈ సంఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తులు రహదారిని దిగ్బంధించారు. ఆ వ్యక్తి మృతదేహాంతో నిరసన తెలిపారు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం రాల్వాస్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక లైబ్రరీకి వెళ్లారు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 25 ఏళ్ల హన్స్‌రాజ్‌పై రంగులు పూసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోవడంతో ఆ ముగ్గురూ బెల్టులతో అతడ్ని కొట్టారు. ఒక వ్యక్తి గొంతు నొక్కడంతో అతడు మరణించాడు.
కాగా, ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. అర్ధరాత్రి వరకు హన్స్‌రాజ్ మృతదేహంతో నిరసన తెలిపారు. రూ. 50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నిందితులైన అశోక్, బబ్లు, కలురామ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల హామీతో నిరసన విరమించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.