న్యూఢిల్లీ : ఉద్యోగం పోయిందంటే ఎవరైనా దిగులు పడతారు. ఈఎంఐలు, ఇంటి అద్దెలు తలచుకుని బావురుమంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే టెకీలైతే కొలువు పోయిందంటే ఓ పట్టాన కోలుకోలేరు. అయితే ఈ యువకుడు మాత్రం ఉద్యోగం ఊడినా నిశ్చింతగా ఉన్నాడు. అసలు స్టోరీ ఏంటంటే.. ట్విట్టర్ కొత్త బాస్‌గా ఎలన్ మస్క్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సీఈఓ పరాగ్ అగర్వాల్ నుంచి వేలాది మంది ఉద్యోగులను సాగనంపుతున్నారు.
Just got laid off.
Bird App, it was an absolute honour, the greatest privilege ever to be a part of this team, this culture 🫡💙#LoveWhereYouWorked #LoveTwitter pic.twitter.com/bVPQxtncIg— Yash Agarwal✨ (@yashagarwalm) November 4, 2022
ఉద్యోగులకు ఈమెయిల్ పంపుతూ ఇంటికి పంపిస్తున్నారు. సగానికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సదరు కంపెనీ ఇప్పటికే బాంబు పేల్చింది. ఈ క్రమంలో మస్క్ ట్విట్టర్ బాస్ అయిన తర్వాత 25 ఏండ్ల యష్ అగర్వాల్ కూడా ఉద్యోగం కోల్పోయాడు. యష్ సోషల్ మీడియా వేదికగా తన లేఆఫ్ గురించి ఫ్రెండ్స్, ఫాలోయర్స్‌తో పంచుకున్నాడు. తాను సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ట్విట్టర్ లోగోతో కూడిన రెండు కుషన్స్‌ను రెండు చేతులతో చూపుతూ ఖుషీగా ఉన్న ఫోటోను పంచుకున్నాడు.
ట్విట్టర్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను..బర్డ్ యాప్‌లో పనిచేయడం ఎంతో గౌరవప్రదం..ఈ టీంలో, కల్చర్‌లో భాగస్వామి అయినందుకు ఎంతో గర్విస్తున్నానని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. యష్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి పాజిటివిటీ..దయతో కూడిన మాటలకు యూజర్లు ఫిదా అయ్యారు. నీవు అద్భుతమైన వ్యక్తివి యష్..నిన్ను చూసి ట్విట్టర్ గర్విస్తుందని ఓ యూజర్ రాసుకొచ్చారు.నీవు ఓ అద్భుత ప్లాట్‌ఫాంను బిల్డ్ చేశావు..నిన్ను కోల్పోయినందుకు వారే నష్టపోతారని మరో యూజర్ పేర్కొన్నారు. మీకు దీనికంటే మెరుగైనదే వేచిచూస్తోందని ఆల్ ది బెస్ట్ అంటూ మరో యూజర్ యష్‌కు బాసటగా నిలిచారు.