లక్నో: ఒక వ్యక్తి ఆడ వేషంలో పెళ్లైన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తనతో రావాలని ఆమెను బలవంతం చేశాడు. ఆ మహిళ నిరాకరించడంతో వెంట తెచ్చిన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. (Man Sets On Fire Married Lover) పారిపోయేందుకు టెర్రస్ పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాలో నివసించే 30 ఏళ్ల రేఖ ఇంటికి హర్యానాలోని హసన్పూర్ గ్రామానికి చెందిన బంధువైన 28 ఏళ్ల ఉమేష్ తరచుగా వెళ్లేవాడు. ఈ నేపథ్యలో వివాహిత అయిన ఆమెకు, అతడి మధ్య సంబంధం ఏర్పడింది.
కాగా, గత ఏడాది ఆగస్ట్ 31న ఉమేష్‌తో కలిసి రేఖ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో రేఖ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 10న ఆమెను తీసుకువచ్చి కుటుంబానికి అప్పగించారు. ఈ సంఘటన తర్వాత రేఖ తన తప్పు తెలుసుకున్నది. ఉమేష్‌కు దూరంగా ఉంటున్నది.
మరోవైపు మార్చి 11న ఉమేష్ లెహంగా ధరించాడు. మహిళ వేషంలో ఉన్న అతడు ఫ్రెండ్ బైక్‌పై రేఖ నివసించే గ్రామానికి చేరుకున్నాడు. ఏడు, ఐదేళ్ల వయస్సున్న పిల్లలు స్కూల్‌కు, వ్యవసాయ కూలీ అయిన భర్త పనికి వెళ్లడంతో రేఖ ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆ సమయంలో ఉమేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. తనతో వచ్చేయమని బలవంతం చేశాడు.
కాగా, రేఖ నిరాకరించడంతో బాటిల్లో తెచ్చిన పెట్రోల్‌ను ఆమెపై పోసి ఉమేష్ నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు టెర్రస్ పైనుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. మంటల్లో కాలుతున్న రేఖ అరుపులకు స్థానికులు అక్కడకు వచ్చారు. మంటలు ఆర్పి ఆమెను కాపాడారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. 70 శాతం కాలిన గాయాలైన రేఖతోపాటు టెర్రస్ పైనుంచి దూకంతో తీవ్రంగా గాయపడిన ఉమేష్‌ను చికిత్స కోసం ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. వారిద్దరూ కోలుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.