బెంగుళూరు: భార్యపై టాయిలెట్ క్లీనర్ యాసిడ్ చల్లాడు(Acid Attack) భర్త. ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగుళూరులోని సిద్దేదహల్లి ఎన్ఎంహెచ్ లేఔట్లో జరిగింది. మే 19వ తేదీన ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే. భర్త యాసిడ్ చల్లడం వల్ల 44 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె తల, ముఖం కాలింది. ప్రస్తుతం ఆమె ప్రమాదకర స్థితి నుంచి బయటపడింది. ఓ ఆస్పత్రిలో ఆమె కోలుకుంటోంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆ మహిళ ఓ బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఆ రోజు రాత్రి 9 గంటలకు మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు భర్త. ఆమె నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. కానీ చివరకు డబ్బులు ఇచ్చిందామె. అయితే ఫుల్లుగా తాగి వచ్చిన అతను తన మొబైల్ ఫోన్లో పెద్దగా సౌండ్ పెట్టి పాటలు విన్నాడు. సౌండ్ తగ్గించాలని భార్య అడగడంతో.. దాన్ని అతను వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.
అకస్మాత్తుగా టాయిలెట్‌కు వెళ్లి అక్కడ ఉన్న యాసిడ్ క్లీనర్‌ను తీసుకువచ్చి భార్యపై చల్లాడతను. తల, ముఖంపై ఆ యాసిడ్ పడింది. మంట తట్టుకోలేక ఆమె అరవడంతో.. అతను అక్కడ నుంచి పారిపోయాడు. పక్కింటివాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, ఆమె భర్త కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.