పాట్నా: ఒక వ్యక్తి, మైనర్ భార్య పోలీస్ కస్టడీలో మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. విధ్వంసం సృష్టించడంతోపాటు పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. (Police Station Set On Fire) దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పలు పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా పోలీసులను రప్పించారు. బీహార్‌లోని అరారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తారాబరి గ్రామానికి చెందిన వ్యక్తి భార్య ఏడాది కిందట చనిపోయింది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వయసున్న భార్య చెల్లిని మంగళవారం అతడు పెళ్లి చేసుకున్నాడు.
కాగా, ఆ వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో గురువారం వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కొట్టి పోలీస్ కస్టడీలో ఉంచారు. అయితే ఆ వ్యక్తి, మైనర్ భార్య అయిన బాలిక లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. తారాబరి పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. పోలీస్ సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిసర పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.