భువనేశ్వర్: ఒక వ్యక్తి మద్యం కొనేందుకు సంక్షేమ పథకం డబ్బు ఇవ్వాలని భార్యతో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో కర్రతో కొట్టి హత్య చేశాడు. ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో భార్య మృతదేహాన్ని పాతిపెట్టాడు. (Man Kills Wife) తమ తల్లి కనిపించకపోవడంతో పొరుగువారిని పిల్లలు అలెర్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని ధెంకనాల్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సుభద్ర యోజన’ పథకం డబ్బు ఒక మహిళ ఖాతాలో జమ అయ్యింది. శుక్రవారం ఇది తెలుసుకున్న గిరీష్ తన భార్యతో కలిసి ఆ డబ్బు డ్రా చేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మద్యం కొనడానికి ఆ డబ్బు ఇవ్వాలని భార్యను అడిగాడు. ఆమె నిరాకరించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన గిరీష్ కర్రతో దాడి చేసి భార్యను హత్య చేశాడు. ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టాడు.
కాగా, ఆ దంపతులకు చెందిన నలుగురు పిల్లలు తమ తల్లి కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. శుక్రవారం రాత్రి తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగినట్లు శనివారం ఉదయం పొరుగువారికి చెప్పారు. దీంతో వారు అక్కడ వెతకగా పెరట్లో ఉన్న సెప్టిక్ గుంతలో మనిషి చేయి వారికి కనిపించింది. ఈ నేపథ్యంలో వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గిరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.