ముంబై: ఒక వ్యక్తి తన కుమారుడ్ని దారుణంగా చంపాడు. కాగితాల ఉండను నోట్లో కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. (Man Kills Son) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో గొడవల వల్ల 59 ఏళ్ల వ్యక్తి, అతడి భార్య విడివిడిగా నివసిస్తున్నారు. 9 ఏళ్ల కుమారుడు తల్లి వద్ద ఉంటున్నాడు. సోమవారం ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అంతా వెతికారు. చివరకు మంగళవారం ఉదయం బాలుడి తండ్రి ఇంటి సమీపంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగితాల ఉండను బాలుడి నోట్లో కుక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు గ్రహించారు. బాలుడి ముక్కు నుంచి రక్తం కారడాన్ని గమనించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం సేవించిన అతడు భార్య వద్ద ఉంటున్న కుమారుడ్ని దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.