చెన్నై: కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి అక్కను చంపాడు. (Honour Killing) ఆమెతో సంబంధం ఉన్న వేరే కులానికి చెందిన ప్రియుడి తల నరికి హత్య చేశాడు. తెగిన తలను బహిరంగంగా ప్రదర్శించాడు. తమిళనాడులోని మదురై జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. తిరుమంగళం సమీపంలోని కూడకోయిల్కు చెందిన 25 ఏళ్ల మహాలక్ష్మికి మదురైలోని వాణియంకులం ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. దీంతో మహాలక్ష్మీ భర్తను వీడి పుట్టింటికి వచ్చింది.
కాగా, స్థానిక వ్యక్తి అయిన 28 ఏళ్ల సతీష్ కుమార్, మహాలక్ష్మీ మధ్య సంబంధం ఏర్పడింది. అయితే కులాంతర వ్యక్తితో అక్క చనువుగా ఉండటాన్ని తమ్ముడైన 22 ఏళ్ల ప్రవీణ్ కుమార్ వ్యతిరేకించాడు. అతడికి దూరంగా ఉండాలని సోదరిని పలుమార్లు హెచ్చరించాడు. వారి తీరు మారకపోవడంతో ఇద్దరినీ హత్య చేయాలని నిర్ణయించాడు.
మంగళవారం రాత్రి ప్రవీణ్ కుమార్ తొలుత సతీష్ కుమార్ను గొడ్డలితో నరికి చంపాడు. తల వేరు చేసి అందరూ చూసేలా బహిరంగంగా వేలాడదీశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి గొడ్డలితో నరికి అక్కను కూడా హత్య చేశాడు. అడ్డుకోబోయిన తల్లి చేతిని నరికాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు మహాలక్ష్మి, సతీష్ కుమార్ మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కులోన్మాద హత్యల సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.