ముంబై: ముంబైలోని మజ్గావ్లో 22 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. గణేశుడి ఊరేగింపు(Ganesh Idol Procession)పై అతను కోడిగుడ్లు విసిరినట్లు తెలిసింది. ఓ హౌసింగ్ సోసైటీ వద్ద బాణాసంచా పేల్చడం వల్ల దట్టమైన పొగ వ్యాపించింది, ఇక ఆ సమయంలో ఆ సమీపం నుంచి వెళ్తున్న నిందితుడు దానిష్ షేర్ ఖాన్ .. కోపంతో కోడిగడ్లు విసిరినట్లు డీప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు జయంత్ మీనా తెలిపారు. ఎగ్ డెలివరీలకు ఆన్లైన్ ఆర్డర్ తీసుకునే అతను.. ఘటన జరిగిన రోజున మజ్గావ్లోని కాంటినెంటల్ హైట్స్ బిల్డింగ్‌కు వెళ్లాడు. బాణాసంచా స్మోక్ వల్ల అతని కండ్లు మండిపోయాయి. దీంతో అతను సరిగా నడవలేకపోయాడు. ఇక ఆ దశలో కోపంతో తన వద్ద ఉన్న గుడ్లను గణేశుడి ఊరేగింపు విసిరాడు.
బైకుల్లా పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. ఆదివారం రాత్రి మజ్గావ్ మండపానికి గణేశుడిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.కాంటినెంటల్ హైట్స్ బిల్డింగ్‌లోని అప్పర్ ఫ్లోర్ నుంచి గుడ్లు విసరడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. నిందితుడి కోసం అయిదు బృందాలు గాలించాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన 36 గంటల తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ మీనా తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ 299, 196 కింద కేసు బుక్ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.