లక్నో: మహిళలతో కూడిన ముఠా ఒక వ్యక్తిని హనీట్రాప్ చేశారు. డేటింగ్ కోసం పిలిచి అతడ్ని కిడ్నాప్ చేశారు. (Man On Blind Date Kidnaped) అతడి కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని కాపాడారు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన 50 ఏళ్ల లల్లూ చౌబేకు ఒక మహిళ ఫోన్ చేసింది. డేటింగ్ పేరుతో అతడ్ని ఝాన్సీకి గురువారం రప్పించింది. కొందరు వ్యక్తులు చౌబేను కిడ్నాప్ చేసి ఒక చోట బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేశారు. చౌబేను విడిచిపెట్టేందుకు మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష ఇచ్చినప్పటికీ అతడ్ని విడిచిపెట్టలేదు.
కాగా, చౌబే కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఒక కానిస్టేబుల్ చౌబే కుమారుడిగా నటించాడు. డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చేందుకు వారిని కలిశాడు. లల్లూ చౌబేను నిర్బంధించిన చోటుకు ఆ కానిస్టేబుల్‌ను ఒక వ్యక్తి తీసుకెళ్లాడు. అనుసరించిన పోలీస్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. కిడ్నాపైన లల్లూ చౌబేను కాపాడారు. ముగ్గురు నిందితులైన 35 ఏళ్ల కిరణ్, 30 ఏళ్ల అఖిలేష్ అహిర్వార్, 27 ఏళ్ల సతీష్ సింగ్ బుందేలాను పోలీసులు అరెస్ట్ చేశారు. హనీట్రాప్ ముఠాలో పలువురు మహిళలు కూడా ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.