న్యూఢిల్లీ: ఒక వ్యక్తి మార్నింగ్ వాక్కు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చిన అతడు తన తల్లిదండ్రులు, సోదరి కత్తిపోట్లతో మరణించడం చూసి షాక్ అయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రిపుల్ మర్డర్‌పై దర్యాప్తు చేస్తున్నారు. (Triple Murder) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం అర్జున్ అనే వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మార్నింగ్ వాక్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. 51 ఏళ్ల తండ్రి రాజేష్ కుమార్, 46 ఏళ్ల తల్లి కోమల్, 23 ఏళ్ల సోదరి కవిత కత్తిపోట్లతో మరణించడాన్ని చూసి షాకయ్యాడు. అతడి కేకలు విన్న స్థానికులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. పెళ్లి రోజు కావడంతో తన తల్లిదండ్రులకు విష్ చేసి తాను మార్నింగ్ వాక్కు వెళ్లినట్లు అర్జున్ తెలిపాడు. తిరిగి వచ్చే సరికి కత్తిపోట్లతో వారు చనిపోయినట్లు చెప్పాడు.
మరోవైపు ఆ ఇంట్లో చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.