లక్నో: బస్సులో ప్రయణించిన ఒక వ్యక్తి పాన్ ఉమ్మేందుకు డోర్ తెరిచాడు. అదుపుతప్పిన అతడు కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడి మరణించాడు. (Man Falls To Death From Bus) ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ ఆర్టీసీకి చెందిన ఏసీ బస్సు అజంగఢ్ నుంచి లక్నో వెళ్తున్నది. ఆ బస్సులో ప్రయాణించిన 45 ఏళ్ల వ్యక్తి, పాన్ ఉమ్మేందుకు బస్సు డోర్ తెరిచాడు. అదుపు కోల్పోయిన అతడు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో వేగంగా వెళ్తున్న ఆ బస్సు నుంచి రోడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, లక్నోలోని చిన్హట్ ప్రాంతానికి చెందిన రామ్ జివాన్గా మృతుడ్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి భార్య సావిత్రి కూడా ఆ బస్సులో ప్రయాణిస్తోందని పోలీస్ అధికారి తెలిపారు. ఆ బస్సును కూడా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.