లక్నో: తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. తనను కిడ్నాప్ చేశారంటూ తండ్రికి మెసేజ్ పంపాడు. ఆందోళన చెందిన తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఆచూకీని పోలీసులు గుర్తించారు. నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలుసుకుని అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Arrested For Fake Kidnapping) ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన 28 ఏళ్ల ప్రదీప్ చౌహాన్ తన తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ వేశాడు. మార్చి 7న తండ్రి రామ శంకర్ చౌహాన్‌కు అతడు మెసేజ్ పంపాడు. తాను కిడ్నాప్‌నకు గురయ్యానని, కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు.
కాగా, తండ్రి రామ శంకర్ చౌహాన్ ఆందోళన చెందాడు. తన కుమారుడు ప్రదీప్ కిడ్నాపైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూణేలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలోని హింజెవాడిలో ప్రదీప్ ఉన్నట్లు సాంకేతిక ఆధారాల ద్వారా తెలుసుకున్నారు. పోలీసులు అక్కడకు వెళ్లి అతడ్ని అదుపులోకి తీసుకుని ఉత్తరప్రదేశ్‌కు తరలించారు.
మరోవైపు ప్రదీప్‌ను పోలీసులు ప్రశ్నించారు. తండ్రిని డబ్బులు డిమాండ్ చేసేందుకు నకిలీ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు అతడు ఒప్పుకున్నాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన కుమారుడ్ని విడుదల చేయాలంటూ పోలీసులను తండ్రి ప్రాధేయపడ్డాడు. దీంతో ఆయన నుంచి డబ్బులు కట్టించుకుని బెయిల్‌పై విడుదల చేశారు.