కోల్కతా: ఒక వ్యక్తి అప్పులపాలయ్యాడు. దీంతో బ్యాంకు నుంచి తీసుకున్న ఇంటి రుణం చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ బ్యాంకును దోచుకునేందుకు ప్లాన్ చేశాడు. బొమ్మ తుపాకీతో బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను బెదిరించాడు. (Man tries to rob bank with toy gun) అయితే అది పేలని గన్ అని తెలియడంతో అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. 31 ఏళ్ల దలీమ్ బసు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. జాతీయ బ్యాంకు నుంచి హౌస్ లోన్ తీసుకున్నాడు. అప్పులపాలు కావడంతో వాయిదాలు చెల్లించలేకపోయాడు.
కాగా, తన అప్పులు, ఇంటి రుణం నుంచి బయటపడేందుకు ఏకంగా ఆ బ్యాంకును దోచుకోవాలని బసు ప్లాన్ వేశాడు. ఏప్రిల్ 11న సాయంత్రం 3 గంటల సమయంలో సర్వే పార్క్ ప్రాంతంలోని బ్యాంకులోకి ప్రవేశించాడు. టాయ్ గన్ బయటకు తీసి బ్యాంకు సిబ్బంది, కస్టమర్లను బెదిరించాడు. వారి వద్ద ఉన్నవన్నీ తనకు ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు.
మరోవైపు బసు చేతిలో ఉన్నది పేలని బొమ్మ తుపాకీ అని బ్యాంకు మేనేజర్, కస్టమర్లు గ్రహించారు. దీంతో అతడ్ని వెనుక నుంచి పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన పోలీసులకు బసును అప్పగించారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. టాయ్ గన్తోపాటు ఒక కత్తిని కూడా బసు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.