లక్నో: టాయిలెట్‌ను వినియోగించిన తర్వాత ఫ్లష్ చేయడంతో అది పేలింది. (Toilet Seat Explodes) దీంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మురుగునీటి పైపుల్లో మీథేన్ వాయువు పేరుకుపోవడం ఈ పేలుడుకు కారణంగా తెలుస్తున్నది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 36లో నివసించే 20 ఏళ్ల అషు టాయిలెట్ వినియోగించిన తర్వాత ఫ్లష్ బటన్ నొక్కాడు. ఆ వెంటనే టాయిలెట్ సీటు పేలింది. ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. 35 శాతం కాలిన గాయాలైన అతడ్ని కసానాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అషు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
కాగా, ఈ విషయం తెలిసి స్థానికులు షాక్ అయ్యారు. మురుగునీటి వ్యవస్థలో మీథేన్ వాయువు పేరుకుపోవడం, ఆ గ్యాస్ బయటకు వెళ్లే ఏర్పాట్లు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. గ్రేటర్ నోయిడా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మురుగునీటి వ్యవస్థలను తనిఖీ చేసి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మురుగునీటి వ్యవస్థలో ఎలాంటి సమస్యలు లేవని అధికారి తెలిపారు. ఇదే తొలి సంఘటన అని చెప్పారు. ఐఐటీ నిపుణుల సహాయంతో పరిశీలించి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.