లక్నో : సినిమా చూసేందుకు మాల్‌కు వచ్చిన వ్యక్తి అనూహ్యంగా కుప్పకూలిన ఘటన (Heart Attack In Mall) యూపీలోని లఖింపూర్ ఖేరిలో వెలుగుచూసింది. గదర్-2 మూవీ చూసేందుకు స్ధానిక ఫన్ మాల్‌కు వచ్చిన 35 ఏండ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన మొత్తం సినిమా హాల్లో ఏర్పాటైన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేవగంజ్‌లో మెడికల్ షాప్ నడిపే అక్షత్ తివారీ ఇటీవల విడుదలైన గదర్-2 మూవీ చూసేందుకు శనివారం రాత్రి ఫన్ మాల్‌కు వచ్చాడు.
ఫోన్లో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతున్న తివారీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు. తివారీ కిందపడిపోవడం చూసిన అక్కడున్న వారు చుట్టూ చేరారు. సెక్యూరిటీ గార్డు, బౌన్సర్లు అతడి ముఖంపై నీళ్లు చల్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే తివారీ మరణించి ఉంటాడని ప్రాధమిక వివరాల ప్రకారం వెల్లడైంది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నవయసులోనే యువత గుండెపోటు బారినపడి కుప్పకూలుతున్న దృశ్యాలు ఇటీవల తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువతలో గుండెపోటు మరణాలకు కుటుంబసభ్యుల్లో హృద్రోగాలు, మధుమేహం, అధిక రక్తపోటు, జీవనశైలి సమస్యలు, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
Read More :