భువనేశ్వర్: భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా భార్య తన మొబైల్ ఫోన్‌తో భర్త తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Wife Hits With Mobile, Man Dies) ఒడిశాలోని బోలాంగిర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ సమయంలో భార్య తన మొబైల్ ఫోన్‌తో భర్త తలపై కొట్టింది.
కాగా, తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని బోలాంగిర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు మళ్లీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మరణంపై స్పష్టత వస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. దాని ఆధారంగా ఆ వ్యక్తి భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.