రాంచీ, జూలై 17: పొట్ట తగ్గించుకొనేందుకు ఇలా చేయండి.. జలుబు రాకుండా అలా చేయండి.. అంటూ అనేక సొంత చికిత్సలు మనం యూట్యూబ్ వీడియోల్లో చూస్తూనే ఉంటాం. పంటి నొప్పి విషయంలో ఈ విధంగా యూట్యూబ్ చికిత్సను గుడ్డిగా పాటించడంతో, వికటించి ఓ వ్యక్తి మరణించాడు.
ఈ ఘటన జార్ఖండ్‌లోని హజారీభాగ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తీవ్ర పంటి నొప్పి నుంచి ఉపశమనం కోసం 26 ఏండ్ల నునుచంద్ మహతో అనే వ్యక్తి.. ఓ యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టుగా, అధిక సంఖ్యలో గన్నేరు విత్తనాలను తిన్నాడు. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి విషమించి.. దవాఖానలో చేర్చేలోపే మరణించాడు.