లక్నో: ఒక వ్యక్తి గుట్కా ప్యాకెట్ కొన్నాడు. దాని కోసం రూ.10 చెల్లించలేదు. ఏడాదిపైగా అడిగి అడిగి విసిగిపోయిన షాప్ యజమాని చివరకు పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆ వ్యక్తి నుంచి రూ.10 వసూలు చేశారు. (Man Dials Police Over Rs. 10) ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భండారీ గ్రామానికి చెందిన జితేంద్ర అనే దివ్యాంగుడు పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన సంజయ్ ఏడాదిన్నర కిందట రూ.10 విలువైన గుట్కా ప్యాకెట్ కొన్నాడు. అయితే ఆ డబ్బు చెల్లించలేదు.
కాగా, రూ.10 కోసం సంజయ్‌ను జితేంద్ర పలుమార్లు అడిగాడు. ఏడాదిన్నర కాలంగా అతడు ఇవ్వకపోవడంతో విసిగిపోయాడు. దీంతో పోలీస్ హెల్ప్‌లైన్ 112కు జితేంద్ర ఫోన్ చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. దివ్యాంగుడైన పాన్ షాపు యజమాని గోడు విన్నారు. సంజయ్‌ను పిలిపించి రూ.10ను జితేంద్రకు ఇప్పించారు.