అహ్మదాబాద్: బంధువుకు చెందిన సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆ జాబ్ పట్ల విసిగిపోయాడు. పని మానేయడంపై తన బంధువుకు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పనికి అనర్హుడయ్యేందుకు తన చేతి వేళ్లను నరుక్కున్నాడు. (Man Chops Off Own Fingers) చేతబడి కోసం ఎవరో ఈ పని చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల మయూర్ తారాపరా తన బంధువుకు చెందిన వజ్రాల సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆ పని పట్ల విసిగిపోయిన అతడు జాబ్ మానేయాలనుకున్నాడు. అయితే ఈ విషయాన్ని బంధువుకు చెప్పే ధైర్యం చేయలేకపోయాడు.
కాగా, డిసెంబర్ 8న రాత్రి పది గంటల సమయంలో బైక్‌పై స్నేహితుడి ఇంటికి తారాపరా బయలుదేరాడు. అమ్రోలిలోని వేదాంత సర్కిల్ సమీపంలోని రింగ్‌రోడ్ వద్ద బైక్ ఆపాడు. కొనుగోలు చేసిన పదునైన కత్తితో ఎడమ చేతిలోని నాలుగు వేళ్లను నరుక్కున్నాడు. నరుక్కున్న వేళ్లను, కత్తిని ఒక సంచిలో ఉంచి దూరంగా విసిరేశాడు. రక్తం కారకుండా మోచేతి దగ్గర తాడు కట్టుకున్నాడు. ఫ్రెండ్స్‌కు ఫోన్ చేయగా అక్కడకు వచ్చి అతడ్ని హాస్పిటల్‌కు తరలించారు.
మరోవైపు బైక్‌పై వెళ్తున్న తనకు కళ్లు తిరగడంతో అక్కడ అచేతనంగా పడిపోయినట్లు పోలీసులకు తారాపరా తెలిపాడు. పది నిమిషాల తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు ఎడమ చేతి నాలుగు వేళ్లు నరికివేయడాన్ని గమనించినట్లు చెప్పాడు. చేతబడి కోసం ఎవరో ఈ పనిచేసినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. తారాపరా ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. సాంకేతిక, నిఘా ఆధారాలు సేకరించారు. దీంతో తారాపరానే తన చేతి వేళ్లను నరుక్కున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం ఇష్టం లేక ఇలా చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. ఒక బ్యాగ్‌లో మూడు వేళ్లు, మరో బ్యాగ్‌లో కత్తిని కనుగొని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.