పాట్నా: భార్యను భూతం, పిశాచి అని భర్త పిలవడం క్రూరత్వం కాదని పాట్నా హైకోర్టు తెలిపింది. (calling wife ‘bhoot’ not cruelty) వైవాహిక సంబంధాలు లేదా దెబ్బతిన్న సంబంధాలలో భార్యాభర్తలు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం, అసభ్యకరమైన పదజాలం వాడటం సాధారణమేనని పేర్కొంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. జార్ఖండ్‌కు చెందిన భర్త నరేష్ కుమార్, మామపై అతడి భార్య 1994లో నవాడా కోర్టును ఆశ్రయించింది. వరకట్నంగా కారును డిమాండ్ చేస్తున్నారని, దీని కోసం తనను మానసికంగా, భౌతికంగా హింసించారని ఆరోపించింది.
కాగా, ఆ కేసు బీహార్‌లోని నలందా జిల్లా కోర్టుకు బదిలీ అయ్యింది. నరేష్, అతడి తండ్రికి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించడంతోపాటు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. వారిద్దరూ అదనపు సెషన్స్ కోర్టును ఆశ్రయించగా పదేళ్ల తర్వాత 2008లో వారి పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ మధ్యకాలంలో జార్ఖండ్ హైకోర్టు ఆ భార్యాభర్తలకు విడాకులు మంజూరు చేసింది.
మరోవైపు నలంద జిల్లా కోర్టు జారీ చేసిన తీర్పును తండ్రీకొడుకులు పాట్నా హైకోర్టులో సవాల్ చేశారు. న్యాయమూర్తి బిబేక్ చౌదరి నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ విడాకులు పొందిన భార్యను ఆమె భర్త, మామ.. భూతం, పిశాచి పేరుతో వేధించారని ఇది కూర్రత్వమేనని ఆ మహిళ తరఫు న్యాయవాది వాదించారు. దీనిని ఖండించిన పాట్నా హైకోర్టు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.