చండీఘఢ్ : భార్య అభ్యంతరాలను లెక్కచేయకుండా 34 ఏండ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్నా జాక్‌పాట్ తగలని రోషన్ సింగ్‌కు చివరికి రూ 2.5 కోట్ల బంపర్ ప్రైజ్ దక్కింది. పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందడంతో రోషన్ సింగ్ ఎగిరి గంతేశాడు. భటిండా జిల్లాలోని గ్రామానికి చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఉద్యోగిగా 1987లో ఈ వ్యాపారంలో పనిచేస్తున్న రోషన్ సొంతంగా ఓ షాపు నడిపే స్దాయికి ఎదిగాడు. 34 ఏండ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటున్న ఆయన భారీ ప్రైజ్పైనే కన్నేసినా అడపాదడపా రూ 100, రూ 200 ప్రైజ్‌లతో సరిపెట్టుకునేవాడు.
చిరుద్యోగి నుంచి సొంతంగా దుకాణం ఏర్పాటు చేసుకున్నా కుటుంబ అవసరాల కోసం రోషన్ పెద్దమొత్తాన్ని దాచుకోలేదు. సంపాదనలో అధిక మొత్తం లాటరీ టికెట్ల కొనుగోలుకు వెచ్చిస్తుండటంతో రోషన్ భార్య తరచూ అతడిని వారిస్తుండేది. ఇక బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు డీలర్ రోషన్‌కు ఫోన్ చేయగా అది ఫ్రెండ్ నుంచి వచ్చిన ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ స్పష్టం చేయడంతో రోషన్ తన కల ఫలించిందని సంబరపడ్డాడు.
ఏదో ఓ రోజు తాను లాటరీలో ప్రైజ్ గెలుచుకుంటానని కనీసం రూ 10 లక్షలైనా సొంతం చేసుకుంటాననే ఆశ ఉండేదని రోషన్ చెప్పుకొచ్చాడు. మెగా ప్రైజ్ దక్కిందని తెలుసుకున్న రోజు రాత్రంతా తాము నిద్రించలేదని, పన్నులన్నీ తీసేశాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నాడు. ఈ మొత్తాన్ని తమ ముగ్గురు పిల్లల భవిష్యత్ కోసం వెచ్చించడంతో పాటు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పెట్టుబడిగా పెడతానని చెప్పాడు.