పాట్నా: క్షుద్ర పూజల నేపథ్యంలో నరబలికి పాల్పడ్డారు. ఒక వ్యక్తి తలను నరికారు. అతడి మొండేన్ని లీ మంటలో దహనం చేశారు. (Man Beheaded, Torso Burnt) ఆ వ్యక్తి మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. పరారీలో ఉన్న మంత్రగాడి కోసం వెతుకుతున్నారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. గులాబ్ బిఘా గ్రామానికి చెందిన 65 ఏళ్ల యుగల్ యాదవ్ మార్చి 13న అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కుటుంబం మదన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, సమీపంలోని బంగర్ గ్రామంలోని ‘హోలికా దహన్’ బూడిదలో కాలిన మానవ ఎముకలున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. యుగల్ యాదవ్ కాలిన చెప్పులను గుర్తించారు. వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. అక్కడి నుంచి బయలుదేరిన పోలీస్ కుక్క తాంత్రికుడు రామశిష్ రిక్యాసన్ ఇంటికి చేరుకున్నది. అతడు ఇంట్లో లేకపోవడంతో అక్కడున్న బంధువైన ధర్మేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అతడ్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తికి సంతానం కోసం మంత్రగాడు రామశిష్ రిక్యాసన్ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు తెలిపాడు. యుగువల్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చినట్లు చెప్పాడు. తెగిన మొండేన్ని హోలీ మంటలో దహనం చేసినట్లు వెల్లడించాడు. గతంలో కూడా ఒక యువకుడ్ని నరబలి ఇచ్చినట్లు తెలిపాడు.
కాగా, సమీపంలోని పొలాల్లో పడేసిన యుగువల్ యాదవ్ తెగిన తలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మేంద్ర, సుధీర్ పాశ్వాన్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మంత్రగాడు రామశిష్ రిక్యాసన్ కోసం వెతుకున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.