లక్నో: భార్య, నాలుగు నెలల శిశువుతో కలిసి రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తి స్టేషన్‌కు చేరుకున్నాడు. స్టేషన్ బయట మద్యం తాగుతున్న ఇద్దరితో పరిచయం పెంచుకున్నాడు. వారితో కలిసి మద్యం సేవించాడు. అయితే అందులోని ఒకడు పసి పాపను కిడ్నాప్ చేశాడు. (Man Abducts Infant) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 10న మసూరి గ్రామానికి చెందిన దీపక్, 23 ఏళ్ల భార్య అర్చన, నాలుగు నెలల కుమార్తె కిస్మత్తో కలిసి ఘజియాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆగ్రా వెళ్లే రైలు కోసం వారు వేచి ఉన్నారు.
కాగా, రైలు రావడానికి సమయం ఉండటంతో స్టేషన్ బయటకు దీపక్ వెళ్లాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం తాగడాన్ని చూశాడు. వారి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నాడు. తాను కూడా ఆగ్రా వెళ్తున్నట్లు వికాశ్ అనే వ్యక్తి తెలిపాడు. ఈ నేపథ్యంలో దీపక్ వారితో కలిసి మద్యం తాగాడు.
మరోవైపు తిరిగి స్టేషన్లోకి వచ్చిన దీపక్ మద్యం మత్తులో ఉండగా అతడి భార్య టాయిలెట్‌కు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చే సరికి వారి మూడు నెలల పసి బిడ్డ మాయమైంది. మద్యం మత్తు వీడిన తర్వాత దీపక్‌కు ఈ విషయం తెలిసింది. దీంతో రాత్రి 9 గంటల సమయంలో తన భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, తాను పరిచయం చేసుకున్న వికాశ్ తన బిడ్డను కిడ్నాప్ చేసినట్లు దీపక్ ఆరోపించాడు. తన బిడ్డను ఇవ్వమని, డబ్బులు ఇస్తానని పలుమార్లు అతడు తనతో అన్నట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో శిశువు కిడ్నాప్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.