భోపాల్ : తన ప్రియురాలితో జంప్ అయిన ప్రియుడి పట్ల ఆమె కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో అతడిని ఒంటరిగా పట్టుకుని దారుణంగా కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్ షాజపూర్ జిల్లాలోని మాక్సి సిటీకి చెందిన పుష్పక్ భవ్సార్ (22) స్థానికంగా ఓ యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న ఆ ఇద్దరూ.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. అయితే ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరూ విడివిడిగా ఉండేందుకు పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ ప్రేమికులిద్దరూ తిరిగి తమ నివాసాలకు చేరుకున్నారు.
తన బిడ్డను తీసుకొని వెళ్లిపోయిన పుష్పక్‌పై అమ్మాయి తండ్రి, సోదరుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆదివారం మార్కెట్‌కు వచ్చిన పుష్పక్‌ను ఒంటరిగా పట్టుకుని సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను కొందరు తమ మొబైల్స్‌లో చిత్రీకరించి వైరల్ చేశారు. ఈ ఘటనపై మాక్సి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.