చండీగఢ్: భార్యాపిల్లలను విడిచి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిమాండ్ చేసింది. దానికి నిరాకరించిన ప్రియుడ్ని తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసింది. (man beaten up by girlfriend) తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఐసీయూలో చికిత్స పొందాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. గుల్షన్ బజరంగీకి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అయితే విడాకులు తీసుకుని పిల్లలున్న గుంజన్‌తో అతడికి ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నది. ఈ నేపథ్యంలో భార్యాపిల్లలను విడిచిపెట్టాలని లేదా వారిని చంపి తనను పెళ్లి చేసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
కాగా, మార్చి 18 నుంచి ఐదు రోజులపాటు గుల్షన్‌ను గుంజన్ నిర్బంధించింది. మార్చి 22న మత్తులో ఉంచి అతడి ఇంటికి తీసుకెళ్లింది. భార్య, పిల్లలకు విషం ఇచ్చి చంపాలని లేదా తనను పెళ్లి చేసుకునేందుకు భార్యను ఒప్పించాలని ఒత్తిడి చేసింది. అయితే తన కుటుంబానికి హాని తలపెట్టబోనని గుల్షన్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడు రెండో పెళ్లి చేసుకునేందుకు భార్య అంగీకరించింది. అయినప్పటికీ ఆమెను రెండో పెళ్లి చేసుకునేందుకు అతడు నిరాకరించాడు.
మరోవైపు మార్చి 29న గుంజన్‌కు ఇచ్చిన రూ.21.50 లక్షలు తిరిగి ఇవ్వాలని గుల్షన్ డిమాండ్ చేశాడు. దీంతో తన తల్లిదండ్రులతో కలిసి అతడిపై ఆమె దాడి చేయగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రాజీ పేరుతో గుల్షన్‌కు ఒక చోటకు రప్పించారు. అక్కడ గుంపుగా అతడిపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన గుల్షన్‌ను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. దీంతో వారం రోజులపాటు ఐసీయూలో చికిత్స పొందాడు.
కాగా, ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు తనపై దాడి చేసినట్లు పోలీసులకు గుల్షన్ ఫిర్యాదు చేశాడు. అయితే అంతగా శిక్ష పడని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని, వారిని అరెస్ట్ చేయలేదని అతడు ఆరోపించాడు.