చెన్నై, జనవరి 8: అన్నా వర్సిటీలో జరిగిన లైంగిక దాడి కేసు నిందితుడు డీఎంకే సానుభూతిపరుడేనని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం అసెంబ్లీలో అంగీకరించారు. అయితే అతను తమ పార్టీలో సభ్యుడు కాడని, అతడికి తాము ఎలాంటి రక్షణ కల్పించడం లేదని స్పష్టం చేశారు. అతను డీఎంకే సభ్యుడైనా తాను చర్యలు తీసుకుని ఉండేవాడినని ప్రకటించారు. నిందితుడిని కాపాడి ఉండేవారం కాదని, వెంటనే అరెస్టు చేసి, గూండా చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించి ఉండేవారమని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేలా చూడటమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలయ్యేలా చూస్తామని, వేగంగా విచారణ జరిపించి నిందితుడికి గరిష్ఠంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్టాలిన్ ప్రకటించారు.