అహ్మదాబాద్: పురాతన ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారికి చెందిన రూ.78 లక్షల విలువైన బంగారు నగలను ఒక వ్యక్తి దొంగిలించాడు. (Theft in Temple) ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 28న పావగఢ్ కొండలపై ఉన్న పురాతన మహాకాళి దేవి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించిన దొంగ రూ. 78 లక్షల విలువైన ఆరు బంగారు హారాలు, బంగారు పూతపూసిన రెండు వస్తువులు అపహరించాడు.
కాగా, ఆలయ సిబ్బంది నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ చోరీపై స్పందించారు. గుడితో పాటు పరిసర ప్రాంతాల్లోని 150కుపైగా సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. దొంగతనం ముందు రోజు ఒక వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా ఆలయం వద్ద సంచరించడాన్ని గమనించారు. సూరత్‌కు చెందిన విదుర్భాయ్ వాసవగా గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఇంటి నుంచి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన ఆలయ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆలయం హాల్లోని వెంటిలేటర్ నుంచి గర్భగుడిలోకి ప్రవేశించి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు.