చెన్నై: మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. (cheating woman) ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకుని పరారయ్యాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల సిబిచక్రవర్తి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా తిరువిడైమరుధూర్కు చెందిన వితంతు మహిళకు పరిచయం అయ్యాడు. ఇంజినీర్‌గా పేర్కొన్న అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మహిళ నుంచి రూ.3 లక్షల డబ్బు, 120 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయాడు.
కాగా, మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత మహిళ గత ఏడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు నిందితుడైన సిబిచక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 12వ తరగతి మాత్రమే చదివిన అతడు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వితంతు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. సుమారు 80 మంది వేర్వేరు మహిళలతో కలిసి దిగిన ఫొటోలను అతడి మొబైల్ ఫోన్లో గుర్తించారు. నిందితుడు సిబిచక్రవర్తిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.