లక్నో: కదులుతున్న రైలులో ఒక వ్యక్తిపై రైల్వే పోలీసులు దాడి చేశారు. అతడ్ని కొట్టి చంపారు. (Man Beaten To Death By Railway Cops) ఆ వ్యక్తి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల రామ్‌దయాల్ అహిర్వార్ తన కొడుకు విశాల్‌తో కలిసి పని కోసం ఢిల్లీకి బయలుదేరాడు. ఏప్రిల్ 21న గీతా జయంతి ఎక్స్‌ప్రెస్‌లో లలిత్పూర్ చేరుకున్నారు. అక్కడ గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లోకి వారు ఎక్కారు.
కాగా, ఆ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత జనరల్ కోచ్‌లో ఉన్న రామ్‌దయాల్ బీడీ వెలిగించాడు. ఆ ట్రైన్లో ప్రయాణించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) కానిస్టేబుళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక కదులుతున్న రైలులో రామ్దయాల్ను కొట్టారు. ఆ వ్యక్తి, అతడి కుమారుడు మొరపెట్టుకున్నప్పటికీ విడిచిపెట్టలేదు. రామ్దయాల్ను జనరల్ కోచ్ నుంచి స్లీపర్ కోచ్‌లోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు.
మరోవైపు రామ్‌దయాల్ ఆరోగ్యం క్షీణించడంతో అతడి కుమారుడు, కొందరు ప్రయాణికులు మథురలోని రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ట్రైన్ మథుర జంక్షన్‌కు చేరుకోగానే అతడ్ని కొట్టిన కానిస్టేబుళ్లు రైలు దిగి వెళ్లిపోయారు.
కాగా, మెడికల్ బృందం ఆ కోచ్ వద్దకు చేరుకున్నది. రామ్దయాల్ను పరిశీలించిన డాక్టర్ అతడు మరణించినట్లు నిర్ధారించారు. ఆ రైల్వే స్టేషన్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.