Mamata Banerjee | ఆర్జీ కర్ దవాఖాన ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ వైద్యుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కొనసాగుతున్నది. దీనికి తెర దించేందుకు బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే హత్యాచార ఘటనపై గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న వైద్యులను (protesting doctors) ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చివరి ప్రయత్నంగా ఐదోసారి వైద్యులకు ఆహ్వానం పంపింది. కోల్‌కతా కాళీఘాట్‌లోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసంలో సాయంత్రం 5 గంటలకు డాక్టర్లను సమావేశానికి ఆహ్వానించింది. ఈ మేరకు బెంగాల్ చీఫ్ సెక్రటరీ వైద్యులకు లేఖ రాశారు. ఇదే చివరి ఆహ్వానం (final invitation) అని.. ఓపెన్ మైండ్‌తో చర్చలు జరిపేందుకు కలవాలని లేఖలో కోరారు.
కాగా, ఇప్పటికే నాలుగుసార్లు వైద్యులను దీదీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అందుకు కొన్ని షరతులు కూడా పెట్టింది. 15 మంది వైద్యుల ప్రతినిధి బృందంతో చర్చలకు రావాలని ఆహ్వానించింది. అయితే, ఆందోళన చేస్తున్న వైద్యులతో జరిగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వైద్యుల విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో దీదీతో భేటీకి వైద్యులు అంగీకరించలేదు. వైద్యులు పెట్టిన డిమాండ్లను బెంగాల్ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించడంతో వైద్యులు చర్చా వేదికకు రావడానికి తిరస్కరించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సీఎం మమతా బెనర్జీ ప్రజల కోసం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
కాగా, జూనియర్ వైద్యులు ప్రధానంగా ఐదు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవల కోసం తమ పని పరిస్థితులను (వర్కింగ్ కండిషన్స్) మెరుగుపర్చాలని, ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచాలని, హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని, ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Vande Metro | నేటి నుంచి వందే మెట్రో పరుగులు.. నమో భారత్‌గా పేరు మార్పు
Delhi CM | కేజ్రీవాల్‌తో సిసోడియా భేటీ.. తదుపురి సీఎం ఎవరన్నదానిపై చర్చలు.. రేసులో ఉన్నది వీళ్లే..
Killer wolfs | 13 ఏళ్ల బాలుడిపై తోడేలు దాడి