న్యూఢిల్లీ, జూలై 30 : అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కోసం ఆ దేశానికి వెళ్లి వివిధ కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయి స్వదేశానికి రాలేకపోతున్న చట్టవిరుద్ధ కార్మికులు, ఉద్యోగులు ఎలాంటి జైలు శిక్ష, జరిమానా లేకుండా వారి దేశాలకు వెళ్లేందుకు అంగీకరించింది. ఈ కార్యక్రమం ఈ ఏడాది మే 19 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుంది.
చట్టవిరుద్ధంగా ఆ దేశంలో నివసిస్తున్న వారు కేవలం రూ.10 వేలు చెల్లించి తమ దేశాలకు వెళ్లిపోవచ్చు. ఏపీ, తెలంగాణ సహా భారత్ నుంచి వేలాది మంది కార్మికులు మలేషియాకు వెళ్లి వివిధ కారణాలతో చట్టవిరుద్ధ కార్మికులుగా ఉన్నారు. దీనిపై ఇరు రాష్ర్టాల కార్మికులకు తెలిసేలా ప్రభుత్వాలు ప్రకటనలు, ప్రచారం చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు.