Road Accident | కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ రోడ్డు ప్రమాదం హర్యానా సిర్సాలోని షేర్ఘర్ గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకున్నది. మృతులు రాజస్థాన్ వాసులుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు.
అప్పటికే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. గంగానగర్ నుంచి హిసార్లో అశుభ కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిటీ పోలీస్ ఇన్చార్జి శైలేంద్ర కుమార్ వివరించారు. ప్రమాదంలో దంపతులతో పాటు మరో యువతి, యువకుడు మృతి చెందినట్లు తెలిపారు.