Encounter | ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు ఆరుగురు మావోలు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ను బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ధ్రువీకరించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా దళాల బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొందని.. ఈ సమయంలో అక్కడ దాక్కున్న మావోయిస్టులు కాల్పులు జరిపారని.. భద్రతా దళాలు దీటుగా బదులిచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. ఉదయం పది గంటల నుంచి కాల్పులు జరుగుతున్నట్లుగా ఆయన వివరించారు. డీఆర్జీ బీజాపూర్, దంతేవాడ, ఎస్టీఎఫ్ సంయుక్త బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారన్నారు.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో సంఘటనా స్థలంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇన్సాస్, స్టెన్‌గన్, 303 రైఫిల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బస్తర్ ఐజీ సుందర్రాజ్ పీ మాట్లాడుతూ డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్, సీఏఎఫ్ దళాలను చుట్టుపక్కల ప్రాంతాలకు పంపినట్లు ఐజీ పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో గాయపడ్డ నలుగురు నక్సల్స్‌ను సంఘటనా స్థలంలోనే అరెస్టు చేసినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ పేర్కొన్నారు. సంఘటనా స్థలంలోనే వారికి చికిత్స అందించి.. అంబులెన్స్ ద్వారా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.