Soldiers Killed | రాజస్థాన్ బికనీర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మందగుండు పేలడంతో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ నార్త్ క్యాంప్ ఆర్టిలరీ ప్రాక్టీస్ సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. ఈ పేలుడులో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే సూరత్‌గఢ్‌లోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సైనిక విన్యాసాల జరుగుతున్న ఫైరింగ్ రేంజ్‌లోని చార్లీ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సైనికాధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు.
మహాజన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కశ్యప్ సింగ్ ప్రమాదాన్ని ధ్రువీకరించారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ఆర్మీ ప్రాక్టీస్ కొనసాగుతోందని కశ్యప్ సింగ్ తెలిపారు. ట్యాంక్‌లోకి మందుగుండును ఎక్కిస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకున్నది. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో వారం వ్యవధిలో సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇది రెండో ఘటన. ఈ నెల 15న ట్రైనింగ్ సమయంలో ఓ సైనికుడు వీరమణం పొందాడు. చంద్ర ప్రకాష్ పటేల్ టోయింగ్ వాహనానికి తుపాకీని అటాచ్ చేస్తున్నప్పుడు, తుపాకీ గన్ మౌంట్ ర్యాంప్‌పై ట్రాక్షన్ కోల్పోయి వెనుక్కు జారింది. దాంతో జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఫీల్డ్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అప్పటికే చనిపోయినట్లుగా తెలిపారు.