తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధర్మ సంసద్ వేదిక చేసిన వ్యాఖ్యలను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆమోదించేవారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఉన్న వారు అన్ని మతాలను సమ దృష్టితోనే చూడాలని, ఎవరి పట్లా పక్షపాతం చూపకూడదని నేతాజీ పదే పదే అనేవారని, ధర్మ సంసద్ వేదికగా చేసిన వ్యాఖ్యలను నేతాజీ ఆమోదించేవారా? అంటూ మహువా సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రపతి కోవింద్ తన ప్రసంగంలో ఎక్కువ శాతం స్వాతంత్ర సమరయోధులను ప్రస్తావించారని, ఇదంతా ఓ నోటిమాట కోసమే పేర్కొన్నారని ఆమె విమర్శించారు. చరిత్రను మార్చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, భవిష్యత్‌పై తీవ్ర ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఎంపీ మహువా విమర్శించారు.