Maharastra elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయంగా వేడి రాజుకుంటోంది. వివిధ పార్టీలు పొత్తులు, అభ్యర్థుల ఎంపికపై మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ బీజేపీ నేతృత్వంలోని మహాయుతితోనే కలిసి నడుస్తుందని స్పష్టంచేశారు.
తాము తమ పార్టీకి 21 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, కచ్చితంగా తమకు 8 నుంచి 10 సీట్లు దక్కుతాయని విశ్వాసం వ్యక్తంచేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు కొన్ని సీట్లు ఇస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ మహాయుతి సర్కారు కొలువుదీరితే తమకు ఒక మంత్రి పదవి కూడా కావాలని డిమాండ్ చేశామని చెప్పారు.
ఈ ఎన్నికల్లో తాము బీజేపీ, ఏక్నాథ్ షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ వర్గం ఎన్సీపీతో కూడిన మహాయుతితోనే కలిసి నడుస్తామని అథవాలే అన్నారు. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన, శరద్‌పవార్ వర్గం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడీ ఎంత గట్టిగా ప్రయత్నించినా లాభం లేదని, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కంటే మహాయుతీనే బలంగా ఉందని అన్నారు.