Nana Patole : ఓబీసీలంటే బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని, ఆ పార్టీ నేతలు ఓబీసీలను కుక్కలతో పోల్చుతున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆరోపించారు. అదే ఊపులో ఆయన.. ‘ఇప్పుడు బీజేపీని కుక్కతో పోల్చే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అకోలాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ అదే స్పీడ్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని బీజీపీ నేతలు కుట్ర పన్ని కూలగొట్టారని ఆరోపించారు. బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనను తాను దేవుడుగా భ్రమపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ కమ్యూనిటీపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదన్న ఆయన.. మిమ్మల్ని కుక్కలు అంటున్న బీజేపీకి ఓటేస్తారా..? అని ఓబీసీ ఓటర్లను ప్రశ్నించారు.
బీజేపీనే ఇప్పుడు కుక్కతో పోల్చే సమయం వచ్చిందన్నారు. మహారాష్ట్ర నుంచి బీజేపీని పారదోలే సమయం ఆసన్నమైందని చెప్పారు. పలు అబద్దాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇపుడు దాని స్థానమేంటో చెప్పే సమయం దగ్గరపడ్డదని పేర్కొన్నారు. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా, విశ్వగురువులుగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఫడ్నవీస్ కూడా తనను తాను దేవుడిగా భ్రమపడుతున్నారని విమర్శించారు.