Maharastra CM : శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Routh) పై మహారాష్ట్ర సీఎం (Maharastra CM) దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూర్ఖుల మాటలకు తాను స్పందించనని రౌత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముంబై ఉగ్రదాడి కుట్రదారు తహవ్వుర్ రాణా (Tahawwur Rana) ను ఉద్దేశించి సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఫూల్స్ మాటలకు సమాధానం ఇవ్వనని అన్నారు.
అంతేగాక ముంబై దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని ప్రభుత్వం విజయవంతంగా భారతదేశానికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అతడు మన న్యాయవ్యవస్థ ఎదుట విచారణ ఎదుర్కోవాల్సి ఉందని అన్నారు. మనం కసబ్‌ను ఉరితీసినప్పటికీ కుట్రదారు పరారీలో ఉండటం బాధించే విషయమని చెప్పారు. ఇప్పుడు రాణాను భారత్‌కు తీసుకువచ్చామని, అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలని ఫడ్నవీస్ అన్నారు.
సంజయ్ రౌత్ గురువారం ఇదే విషయంపై మాట్లాడుతూ.. రాణాను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్నికల వేళ ఉరితీయొద్దని ఎద్దేవా చేశారు. అదేవిధంగా గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్‌లో పట్టుబడిన భారతీయుడు కులభూషన్ జాదవ్‌కు ఇప్పటికే పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించిందని, ఆయనను స్వదేశానికి రప్పించాలని కూడా రౌత్ డిమాండ్ చేశారు. రాణాను రప్పించడానికి 16 ఏళ్లు పట్టిందని, కాంగ్రెస్ హయాంలోనే అతడిని రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని, ఆ క్రెడిట్‌ను ఎవరూ తీసుకోవద్దని సూచించారు.