సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నది. అయితే ఆమె తన అరచేతిలో సూసైడ్ నోట్(Suicide Note) రాసుకున్నది. గడిచిన అయిదు నెలల్లో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగు సార్లు అత్యాచారం చేసినట్లు ఆ నోట్లో రాసిందామె. ఫల్టన్ సబ్ జిల్లా ఆస్పత్రిలో ఆమె మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మానసికంగా, భౌతికంగా ఎస్సై గోపాల్ బద్నే తనను వేధించినట్లు ఆమె తన చేతిపై రాసుకున్న నోట్లో పేర్కొన్నది. పోలీసులు అదేపనిగా వేధించడం వల్ల తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించింది. ఈ ఆత్మహత్య ఘటన పట్ల మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ప్రస్తుతం నిందిత పోలీసు ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా ఆమె డీఎస్పీకి లేఖ రాసింది. జూన్ 19వ తేదీన ఫల్టన్‌లో ఉన్న డిప్యూటీ ఎస్పీకి ఆ లేఖను పంపింది. ఫల్టన్ గ్రామీణ పోలీసు శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఆఫీసర్లు కూడా తనను వేధించినట్లు ఆమె పేర్కొన్నది. దీనిపై లీగల్ చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరింది. బద్నెతో పాటు పాటిల్, లద్పుత్రే ఆఫీసర్లు పేర్లను కూడా ఆమె తన లేఖలో వెల్లడించింది. తన కేసును తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఆమె గతంలో తన లేఖలో తెలిపింది.
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల ప్రకారం ఆఫీసర్ బద్నేను సస్పెండ్ చేశారు. రక్షించాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తే, అప్పుడు న్యాయం ఎలా దొరుకుతుందని విజయ్ నామ్‌దేవ్ ఆరోపించారు.