ముంబై, ఫిబ్రవరి 27: అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న తమ కుమార్తెను చూడటానికి అత్యవసర వీసా మంజూరు చేయాలంటూ ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. అమెరికాలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్న మహారాష్ట్ర సితార జిల్లాకు చెందిన నీలమ్ షిండే (35) ఈనెల 14న కాలిఫోర్నియాలో ఫోర్ వీలర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నది. కోమాలో ఉన్న తమ కుమార్తెకు బ్రెయిన్ సర్జరీ చేయాలని వైద్యులు తెలిపారని, ఆమెకు వైద్యం చేయించడానికి తాము అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని ఆమె తండ్రి తానాజీ షిండే అత్యవసర వీసాకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ పరిశీలించిందని, ఈ మేరకు యూఎస్ అధికారులను సంప్రదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
నీలమ్ తల్లిండ్రులకు అత్యవసర వీసా మంజూరు చేసేందుకు అమెరికా ఇంటర్వ్యూ తేదీని ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌కు ఇంటర్వ్యూకు రావాలని వారిని కోరింది. ఈ విషయాన్ని బాధితురాలి తండ్రి కూడా నిర్ధారించారు. కాగా, సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీకి వెంటనే వీసా మంజూరవుతుందని, అయితే నీలమ్ విషయంలో ఆలస్యం ఎందుకయ్యిందో తెలియడం లేదని ఒక అధికారి తెలిపారు.