ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన యూబీటీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై స్పందించారు. ‘మహారాష్ట్ర నమూనా’, ఓటర్ల జాబితాలో మోసం పునరావృతమైందని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు, తమ ఆందోళనలు ఎన్నికల సంఘం (ఈసీ) పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘ఎన్నికలకు సంబంధించి ఈసీ, ప్రభుత్వం వైఖరిని చర్చించడానికి మేం మీడియా సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మోసం ఎలా జరుగుతోంది, మహారాష్ట్రలో కొత్త నమూనాను ఎలా సృష్టించారు. ఢిల్లీలో కూడా మహారాష్ట్ర నమూనాను అమలు చేసినట్లు నేను చెప్పాను. అయినప్పటికీ ఈసీ కళ్లుమూసుకున్నది’ అని విమర్శించారు.
కాగా, బీహార్ ఎన్నికల్లో కూడా మహారాష్ట్ర నమూనాను అనుసరిస్తారని సంజయ్ రౌత్ విమర్శించారు. ‘ఐదు నెలల్లో మహారాష్ట్రలో పెరిగిన 39 లక్షల ఓట్లు ఇప్పుడు బీహార్‌కు మళ్లుతాయి. కొన్ని ఢిల్లీకి వెళ్తాయి. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. బీజేపీకి ఓటు వేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఇది బలవంతపు ఓటింగ్’ అని విమర్శించారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా బ్లాక్’లోని భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంటే ఫలితం భిన్నంగా ఉండేదని, బీజేపీ ఓడేదని అన్నారు.