ముంబై: మహారాష్ట్రలోని వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. థానే జిల్లా భివాండి మండలం సోర్గావ్ గ్రామంలోని ‘మాతోశ్రీ’ వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 55 మంది వృద్ధులు, ఐదుగురు ఉద్యోగులు, సిబ్బందికి చెందిన ఏడాదిన్నర పాపతోసహా ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ థానే ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు చెప్పారు.
కాగా, వైరస్ బారిన పడినవారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. నలుగురు మాత్రం ఐసీయూ వార్డులో ఆక్సిజన్ వ్యవస్థపై చికిత్స పొందుతున్నారని చెప్పారు. 15 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్లు వెల్లడించారు. కరోనా సోకిన 62 మందిలో 55 మంది వృద్ధులు టీకా రెండు డోసులు తీసుకున్నట్లు వివరించారు. 62 మందిలో 37 మంది పురుషులు, 25 మంది మహిళలని చెప్పారు. వీరిలో 41 మంది వృద్ధులకు ఇతర అనారోగ్య సమస్యలున్నాయన్నారు. వృద్ధాశ్రమానికి చెందిన మరో ఐదుగురు అనుమానిత రోగులను కూడా ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్చినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు వృద్ధాశ్రమంలో కరోనా ప్రభలడంతో 343 ఇండ్లు, 1,130 మంది జనాభా ఉన్న సోర్గావ్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. స్థానిక నివాసితులకు కూడా కరోనా టెస్ట్ చేస్తున్నారు.