Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బారామతి నుంచి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, యోలా నుంచి ఛగన్ భుజబల్, అంబేగావ్ నుంచి దిలీప్ వాల్సే బరిలోకి దిగనున్నారు. ఇంతకు ముందు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. సీఎం ఏక్నాథ్ షిండే కోప్రి-పచ్పఖాడి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి బరిలోకి దిగనున్నారు. పార్టీ పైథాన్ నుంచి విలాస్ సందీపన్ భూమారేను పోటీకిలో నిలిపింది. ఇక మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) 45 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.
మహిమ్ అభ్యర్థిగా రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేయనున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ కౌన్సిలర్ సందీప్ దేశ్పాండే వర్లీ నుంచి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. జూన్ 2022లో మహావికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని కూల్చి ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్సీపీ విడిపోయింది. అజిత్ పవార్ ప్రభుత్వంలో చేరారు. శివసేన, ఎన్సీపీ పార్టీలు విడిపోయిన అనంతరం తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. 288 మంది సభ్యుల మహారాష్ట్ర శాసనసభలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వానికి ప్రస్తుతం 202 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది.
102 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్నది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి 14 మంది స్వతంత్రుల మద్దతు సైతం ఉన్నది. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరో ఐదు చిన్న పార్టీల మద్దతు ప్రకటించారు. ప్రతిపక్ష కూటమిలో 71 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 37 మంది, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు 16 మంది, సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీఎం, పీడబ్ల్యూపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. ఏఐఎంఐఎంకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష కూటమిలో ఉన్నారు. ఇక 15 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Ncp List