ముంబై, మే 20: సంబంధిత పురపాలక సంస్థ నుంచి పార్కింగ్ ప్లేస్ కేటాయించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలుదారులు చూపించిన తర్వాతే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్)లో పెరుగుతున్న పార్కింగ్ సంక్షోభాన్ని, వాహనాల రద్దీని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కొత్త పార్కింగ్ విధానంపై ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మంత్రి సర్నాయక్ సోమవారం ఈ ప్రకటన చేశారు. పార్కింగ్ ప్రదేశాలను నిర్మించాలని తాము ఆలోచిస్తున్నామని విలేకరులతో మాట్లాడుతూ మంత్రి తెలిపారు. బిల్డర్లు డెవలప్మెంట్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఫ్లాట్లతోపాటు పార్కింగ్ ప్లేస్‌ను కూడా డెవలపర్లు చూపించాలని ఆయన చెప్పారు. సంబంధిత మున్సిపల్ సంస్థ నుంచి ఆ పార్కింగ్ స్పేస్ కేటాయింపు సర్టిఫికెట్ లేకపోతే కొనుగోలుదారుడి కొత్త వాహనానికి రిజిస్ట్రేషన్ జరగబోదని ఆయన స్పష్టం చేశారు. ఎంఎంఆర్‌లో పార్కింగ్‌కు తీవ్రమైన కొరత ఉందని మంత్రి అంగీకరించారు.