న్యూఢిల్లీ, నవంబర్ 23: మహిళాకర్షక పథకాలు పార్టీల గెలుపుపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. రెండు రాష్ర్టాల్లోని అధికార పార్టీలు మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఈసారి వారి ఓటింగ్ శాతం పెరగడమే కాక, అధిక శాతం అధికార పార్టీకే పట్టంగట్టారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన-ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమికి ప్రజలు మరోసారి ఘన విజయాన్ని సమకూర్చారు. ఆగస్టులో ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లడ్కీ బెహిన్ పథకమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్న మహిళలకు ప్రభుత్వం ప్రతినెలా 1,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రారంభించింది. దీనిని రూ.2,100కు పెంచుతామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
మహిళల భద్రతను పెంచడానికి రాష్ట్రంలో 25 వేల మంది మహిళలను పోలీస్ శాఖలో నియమిస్తామని హామీనిచ్చారు. ఇవి మహిళా ఓటర్లను బాగా ఆకర్షించాయి. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రవేశపెట్టిన లాడ్లీ బెహ్నా పథకం మంచి ఫలితాలను ఇవ్వడంతో దానిని మహాలోనూ అమలు చేశారు. ఇక జార్ఖండ్ రాష్ట్ర విషయానికొస్తే తాము అక్కడ అధికారంలోకి వస్తే మహిళలందరికీ నెలకు రూ.2,100 ఆర్థిక సహాయం అందజేస్తామని బీజేపీ తరపున కేంద్ర మంత్రి చౌహాన్ ప్రకటించారు.
అయితే ఆగస్టులోనే అక్కడ అధికారంలో ఉన్న జేఎంఎం ప్రభుత్వం మాయా సమ్మాన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద 21 నుంచి 50 ఏండ్ల లోపు మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద ఆ రాష్ట్రంలో 50 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ఎన్నికల్లో జేఎంఎం విజయానికి దోహదపడింది. ఈ ఎన్నికల్లో మొత్తం 81 స్థానాల్లో 68 సీట్లలో అత్యధికంగా మహిళా ఓటింగ్ శాతం నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు.